Friday, 7 March 2008

కృష్ణా యాస

ఎవరైనా ఎప్పుడైనా కృష్ణా జిల్లా యాస లో తెలుగు విన్నారా?..పోనీ చదవటం కానీ, రాయటం కానీ లేదా మాట్లాడటం కానీ చేశారా? ఏదో ఒకటి చేసే వుంటారులెండి. దినపత్రికల్లో వార్తలు, వెండితైరపై చిత్రాలు చూసే వుంటారు కదా! వాటిల్లో వుండేది కృష్ణా జిల్లా యాసే! చిన్నప్పటినుండి అందరూ అనుకుంటుంటే విన్నానులెండి. కాకపోతే దాన్ని "యాస" అని ఎవరూ అనలేదు..."స్వచ్ఛమైన భాష" అని మాత్రం అనే వారు.

నాకు ఎప్పటినుండో ఒక శంక. యాసలనేవి భాషల్లో కదా వుండేది, మరి కృష్ణా జిల్లా వాళ్ళు మాట్లాడే తెలుగు ని "కృష్ణా యాస" అని ఎందుకు అనరూ అని...శ్రీకాకుళం యాస, తెలంగాణా యాస, సీమ యాస ఆ టైపు లో.

ఇంగ్లీష్ వాడు మాట్లాడే ఇంగ్లీష్ నే "బ్రిటిష్ యాక్సెంట్" అనేటప్పుడు, మన ఆంధ్రదేశం లో కేవలం ఒక ప్రాంతానికి చెందినవారు మాట్లాడే యాస ని "స్వచ్ఛమైన భాష" అని అనటం ఎంతవరకూ సబబు అనిపించింది. అందుకే "కృష్ణా యాస" అనే మాట ని వాడుక లోనికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాను. దానికే ఈ నా మొదటి బ్లొగుని అంకితం చేశాను.

3 comments:

చదువరి said...

మంచి ప్రయత్నం! ఎటొచ్చీ కృష్ణా యాస అని మీరు చెప్పేది కృష్ణా యాస కాదట.. అది కేవలం పత్రికల భాష, అంతే! కృష్ణా యాస వేరుగా ఉంటుంది. ఈ విషయమై గతంలో కూడలి కబుర్లలో చర్చ జరిగింది కూడాను. తెలంగాణ యాస, శ్రీకాకుళం యాస లాగా కృష్ణా యాస, గుంటూరు యాస అని వేరుగా ఉన్నాయి.

Mali said...

ఓ చదువరీ, ధన్యవాదాలు! మీరు చెప్పింది నిజమే, కానీ కృష్ణా యాస, గుంటూరు యాస అనే మాటలు అంత ప్రాచుర్యంలో లేవు. పైపెచ్చు పత్రికల్లో, చలనచిత్రాల్లో వచ్చే భాష తమ భాషేనని కృష్ణా జిల్లా వాళ్ళు చెప్పుకుంటారు. ఇది ఏ ఒక్కరో, ఇద్దరో చెప్పటం కాదు, గత పదిహేను సంవత్సరాలుగా నేను చాలా మంది నోట విన్నాను. వీరితో నాకు జరిగిన అనుభవాలను రాబోయే బ్లాగుల్లో పంచుకుంటాను.

కొత్త పాళీ said...

ఇంచుమించుగా చదువరి గారు చెప్పిన మాటలే నావీని. ఆ పరిణామం ఎలా జరిగితేనేమి? తెలుగు నాడంతటా చదువుకున్న సభ్య సమాజం బయట ఒక చోట కూడితే ఒక లాంటి భాష మాట్లాడుతూ వస్తున్నారు - దాన్నే శిష్టవ్యావహారికం అన్నారు. ఇంట్లో మాట్లాడుకునే భాష, స్త్రీలు మాట్లాడూకునే భాష వేరు. జిల్లాల వారీగానే కాదు, వర్ణాల వారీగా, ఆర్ధిక స్థితిగతుల వారీగా కూడా. ఈ పత్రికల్లో సినిమాల్లో వచ్చేది కృష్ణాజిల్లాభాష అన్న ప్రచారం వల్ల ఇతర ప్రాంతాల యాసలకి ఎంత కీడు జరిగిందని మీరంటూన్నారో, కృష్ణా గుంటూరు ప్రాంతాల యాసకి అంతకంటే ఎక్కువే కీడు జరిగింది. కనీసం మీరు మా యాస మాకుంది, అదే మాకిష్టం అని అలజడి చెయ్యబూనుకున్నారు. కృష్ణా గుంటూరు ప్రజలకి ఒక తియ్యనైన యాస తమకీ ఉందని తెలీనుగూడా తెలీని స్థితిలో ఉన్నారు! ప్చ్!!